కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీ అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి -ఎబివిపి
కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీ అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి -ఎబివిపి
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడి ఇబ్బందులకు గురయ్యారని ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు* అన్నారు. స్థానిక ఏచూరీ శ్రీనివాస్ స్మారక భవనం ఎబివిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎబివిపి నాయకులు మాట్లాడుత కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడ్డ ఈ విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్ మరియు ఇంటర్ నేషనల్ స్కూల్స్, కళాశాలలు ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక
ఫీజుల దోపిడీతో తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తూ కష్ట కాలంలో కాసుల కక్కుర్తితో మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యా సంస్థలు ఫీజులు పెంచొద్దని, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని, అది కూడా నెలవారీగా తీసుకోవాలని సూచించి ఆ ప్రకారం జీవో 46 జారీ చేసినా రాష్ట్రంలో ఏ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ముఖ్యమంత్రి ప్రకటనను, ప్రభుత్వ నిబంధనలను ఖాతరు చేయకుండా నిర్భయంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న దౌర్బాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యానందించి సామజిక బాధ్యతగా వ్యవహరించే యాజమాన్యాల స్థానంలో , కేవలం దనార్జనే తమ ద్యేయంగా ఏర్పాటైన కార్పొరేట్ విద్యాసంస్థలు ఒకే ఆఫీలియేషన్ పేరుతో వందల బ్రాంచ్ లు, ఒకే ర్యాంక్ ను అన్ని బ్రాంచ్ లకు అనునయిస్తూ అనేక ఆకర్షిత పేర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తూ అడ్మిషన్ నుండి పరీక్షల వరకు లక్షల్లో అక్రమంగా ఫీజుల దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గల సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాల, మోంట్ ఫోర్ట్ పాఠశాల మరియు ఏకలవ్య పాఠశాల తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నారాయణ, శ్రీ చైతన్య,జూబ్లీహిల్ పబ్లిక్ స్కూల్, మెరిడియన్ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్, ఒక్రిడ్జ్, శ్రీనిధి, వికాస్, చీరేక్ ఇలా
పేరుమోసిన అనేక పాఠశాలలు గతంలో సాధారణ పరిస్థితుల మాదిరిలా ఏ మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ అండదండలతో , కొందరు అవినీతి విద్యా శాఖ అధికారుల లోపాయికారి ఒప్పందాలతో విద్యా వ్యాపారాన్ని స్వేచ్ఛగా విస్తరిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభుత్వం ద్వారా తమ విద్యా వ్యాపారానికి అనుకూలంగా జీవోలు విడుదల చేయించుకునే స్థాయిలో ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయంటే విద్యా వ్యాపారం ఏ స్థాయిలో ఉందొ అంచనా వేయొచ్చని, ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా రంగంలో ముందు వరుసలో నిలుపుతామని,కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రిస్తామన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం నలుమూలల విస్తరిస్తున్న కార్పొరేట్ మాఫియాను నియంత్రించకపోగా ప్రోత్సహిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుపారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండే విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు . ఈ కరోనా క్లిష్ట సమయంలో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం నిర్థిష్టమైన ఫీజు నిర్ణయించి, అమలయ్యేలా పర్యవేక్షించాలని, కరోనా కాటుతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, ఎన్జి కళాశాల ఉపాధ్యక్షులు ఇస్లావత్ సురేష్,కల్లేపురం దుర్గ, ఐతగొని మణి, బొట్టు ప్రశాంత్,ప్రవీణ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment